ఆ రోజుల్లో సంక్రాంతి అంటే మరి….

సంక్రాంతి అంటే అందరికి ఇష్టమైన పండగ, పిల్లలకైతే మరీను. ఎందుకంటే వాళ్ళకి పది రోజుల సెలవులు దొరుకుతాయి అల్లరి చేసి పెద్దవాళ్ళకి చుక్కలు చూపించటానికి. హాఫ్ ఇయర్లీ ఎక్జామ్స్ అయిపోగానే షాపింగ్ కి తీసుకెళ్తారు పెద్దవాళ్ళు పిల్లలని. ఇంకా అక్కడ వాళ్ళు చూపెట్టేయ్ చుక్కలు అన్ని ఇన్ని కాదు, అప్పట్లో ఆరు జేబుల ప్యాంటు చాల ఫేమస్, మన హైట్ కి అవేమో పెద్దవైపోతాయి, మన సైజులో అవి రావు. నాకు అదెయ్ కావాలని పట్టు పట్టి మరీ కొంటాం. నడుము కి కట్టాల్సిన ప్యాంటు, పొట్టపైకి కట్టి, ఓ నాలుగు మడతలు కింద వేస్తే కానీ సరిగా ఉండదు.

షాపింగ్ ఐపోగానే, అమ్మమ్మ ఇంటికి బస్సు ఎక్కేస్తాం. అసలు ఆట ఇప్పుడే కదా మొదలు. మిగతా మన కజిన్స్ కూడా సెలవులకి వచ్చేస్తే ఇంకా హంగామా షురూ. మనల్ని ఒక్కళ్లని కంట్రోల్ చేయడమే ఒక బ్రహ్మ పరీక్ష మన పెద్దవాళ్ళకి, అదెయ్ టైం లో, ఇంతమంది ఒకేసారి ఒకేదగ్గర ఇంకా మనల్ని ఆపేదెవరు? వాళ్ళకి నరకాన్ని చూపించేయము.

అమ్మమ్మ వాళ్ళు పిండివంటలు చేస్తుంటే, మనం చాటుగా పిండి తీస్కుని వాళ్ళని చేయనీయకుండా చేసే అల్లర్లు అంత ఇంతా కాదు. ఒక్కోసారి అల్లరి మితీమీరితే కుమ్మేసేవాళ్ళు..

భోగి రోజు ఇంట్లో ఉన్న పాత సామాన్లు మంటల్లో కాల్చేసి, కొత్తవాటికి స్వాగతం చెప్తాము. కానీ మన పిల్ల చేష్టలు పాతవికి బదులు కొత్తవి కూడా పడేస్తాం.. మనకు తెలీదు మరి ఆ వయసులో ఏదైనా వేసేయొచ్చు అని వేసేస్తాం.

రెండో రోజు ఉదయాన్నే ముగ్గుల పోటీ షురూ.. ఒకరితో ఒకరికి పోటీ, మాది పెద్దదంటే మాది పెద్దది అని.. వీధి వీధి అంతా రంగుల మయం. ఒకవేళ మన ముగ్గు కంటే ఇంకెవరిదైనా బాగుంటే, ఎవరు చూడక ముందు వెళ్లి పాడు చేసి రావడం. గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు బలే సరదాగా ఉండేది. ముగ్గులన్ని ఐపోయాక చేసిన పిండివంటలు తింటూ జెమిని టీవీ లో వచ్చే సంక్రాంతి సంబురాలు మరియు యాడ్స్ మధ్యలో వేసే సినిమా చూస్తూ రెండో రోజు గడిచిపోయేది.

ఇంకా ఇన్నాళ్లు దాచుకున్న కొత్త బట్టలకి ఇక పని పెడతాం, అందరికంటే ముందే లేచి త్వర త్వరగా స్నానం చేసి కొత్తబట్టలేసుకొని రెడీ అయి వీధిలో అందరికి చూపిస్తూ ఒక చక్కర్ కొట్టి వస్తాం. దీనెమ్మ ఆ రోజుల్లో ఫోన్లు, ఈ సోషల్ నెటవర్క్లు లేవు కానీ, ఉంటేనా ? మన ఫొటోలతో దద్దరిల్లిపోయేవి. అసలు ఆ రోజుల్లో ఆ డ్రెస్సులు, ఆ స్టైలు, ఇప్పుడు ఎవరికీ సాధ్యం కావు.

తిండి మాత్రం నో కంప్రమైజ్. ముక్క లేనిదే ముద్ద దిగదు. రాత్రికే మేకలు కోసి పోగులేసేసేవారు. ఎప్పుడు తెస్తారో, ఎప్పుడు వండుతారో తెలీదు కానీ, మన సోకులైపోయాక మాత్రం ప్లేటు తో రెడీగ ఉంటారు. అది కాస్త కుమ్మేసాక పతంగులాటకి పోయేవాళ్ళం, తిన్నది అరిగేదాకా.

ఇలా సరదాగా అంతా అల్లరి చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, అప్పుడప్పుడు తన్నులు తింటూ మిగతా రోజులని గడుపుతున్న సందర్భంలో, సెలవుల్లో ఇచ్చిన హోమ్ వర్క్ గుర్తుకొచ్చి ఎక్కడా లేని దుఃఖం వస్తుంది. మన టీచర్లకు మనపైన కాస్త కూడా జాలి ఉండదు అందుకే, హాఫ్ ఇయర్లీ ఎక్జామ్స్ లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ని ఐదు ఐదు సార్లు రాయమంటారు, అది కూడా నీట్ గ. ఆరు సబ్జక్టులు, ఒక్కో పేపర్ ఐదు సార్లు రాస్తే ఇంకా మనకి ఆడుకోడానికి టైం ఎక్కడుంటాది?

అంతా మరిచిపోయి అమ్మమ్మ వాళ్ళ ఊరు వదిలి మల్లి మనింటికి పయనమౌతాం, ఎండాకాలం సెలవులు మనసులో పెట్టుకుని.

ఆరోజుల్లో, ఆ సరదాలు వేరు, ఆ బందాలు వేరు, ఆ బంధుత్వాలు వేరు. ఈకాలం లో సెలవులకి ఒకవేళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన, పిల్లలు ఈ అల్లర్లకు బదులు మొబైల్ గేమ్స్ లో ఎక్కువ ఉంటున్నారు. అంతా ఆర్టిఫిషల్ ఎంజాయిమెంట్ లో ఉంటున్నారు. మనం చుసిన ఆ అసలైన సరదాలని, పెద్దలుగా వాళ్ళకి కూడా పంచుదాం. వాళ్ళని లోకాన్ని చుడనిద్దాం.

సంక్రాతి శుభాకాంక్షలు అందరికి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: