16 సంవత్సరాల ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ ఒక్కడు..!

అప్పటి వరకు రాజకుమారుడు, మురారి మాత్రమే మహేష్ బాబు కెరీర్‌లో సూపర్ హిట్స్ గా ఉన్నాయి, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులే మహేష్ బాబు అభిమానులుగా ఉన్నారు. ఇక దర్శకుడు గుణశేఖర్ కి కూడా కెరీర్‌లో సరైన హిట్ లేదు.

2003 లో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో యం.యస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా వచ్చిన ‘ఒక్కడు’ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది, అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ను బద్దలుకొట్టి కొత్త రికార్డ్‌లను సృష్టించింది.

మహేష్ బాబుకి సొంత అభిమానులను సంపాదించి పెట్టింది.హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడిలా అజయ్ పాత్రలో మహేష్ బాబు నటన అదిరిపోయింది, కబడ్డీ ప్లేయర్ గా అదరగొట్టారు,ఇంటెంసిటీ,యాటిట్యూడ్,లుక్స్ పరంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి సొంత అభిమానులను సంపాదించుకున్నారు. హీరోయిన్‌గా చేసిన భూమిక స్వప్న పాత్రలో అమాయకమైన, సమస్యల్లో ఉన్న ఒంటరి ఆడపిల్లలా అభినయమైన నటనతో ఆకట్టుకుంది. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ చేసిన ఓబుల్ రెడ్డి పాత్ర అయితే సంచలనం అయింది, రాయలసీమ యాసలో క్రూరత్వమైన విలన్ గా నటించి మెప్పించారు. ఓబుల్ రెడ్డికి తల్లిగా నటించిన లేడి విలన్ తెలంగాణ శకుంతల సహజంగానే తన పాత్రలో ఒదిగిపోయింది. అప్పటి వరకు ఎన్నో ఫ్యాక్షన్ కథలతో సినిమాలొచ్చాయి కానీ అందులో ఒక్కడు ఒక కొత్త తరహా సినిమాగా రూపొందింది.

ఈ సినిమాకి కథ, కథనాలే ప్రాణం పోశాయి అని చెప్పొచ్చు, గుణశేఖర్ గారి దర్శకత్వం నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసింది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్ వారి రచన సినిమాకి బాగా ప్లస్ అయ్యింది, మాటలు అన్నీ సీన్లలకి తగ్గట్లుగా అతికాకుండా పేలాయి.

మణిశర్మ సంగీతం అయితే సూపర్ హిట్ అయింది, అన్ని పాటలు హిట్ అవ్వగా ‘చెప్పవే చిరుగాలి’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. నేపథ్య సంగీతం సినిమాకి మేయిన్ పిల్లర్ అయింది, ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్, కర్నూలు ఎపిసోడ్‌లో, ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లలో, ఎయిర్ పోర్ట్లో వచ్చే సన్నివేశాలకి ప్రాణం పోసింది. శేఖర్.వి.జోసెఫ్ అందించిన సినిమాటోగ్రఫీ,
ఎ.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమా విజయంలో భాగం అయ్యాయి‌.

సినిమాలో కనిపించే చార్మినార్ సెట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలబడిన ఈ సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ రామానాయుడు స్టూడియోస్ గోపన్నపాలెంలో వేసారు. దాదాపు మూడు వందల మంది ఈ సెట్ కోసం పనిచేశారు. మహేష్ బాబు కెరీర్లోనే మైలురాయిగా నిలబడిన ఈ సినిమా విడుదలైన అన్నీ కేంద్రాలో 50 రోజులు ప్రదర్శించబడి 100 సెంటర్లలో 100 వందరోజులు పూర్తి చేసుకున్నది.

ఈ సినిమా ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కు విక్టరీ వెంకటేష్, ఉదయ్ కిరణ్, ప్రభాస్ ముఖ్య అతిధులుగా వచ్చారు, అలాగే వందరోజుల వేడుకకు జూ.ఎన్.టీ.ఆర్,ప్రభాస్ హాజరయ్యారు. ఈ సినిమా ఎనిమిది నంది అవార్డులను,నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఇంక పలు క్యాటగిరిల్లో పలు అవార్డులను గెలుచుకుంది.

సంక్రాంతి కానుకగా 2003 లో జనవరి 15 న విడుదలైన ఈ సినిమా ఈరోజుతో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మహేష్ బాబు కెరీర్ నే మలుపు తిప్పిన చిత్రంగా ఒక్కడు ఉండిపోయింది. చాలా సందర్భాలలో ఈ సూపర్ స్టార్ తో పనిచేసిన పలు దర్శకులు తమ ఆల్ టైం ఫెవరేట్ ఒక్కడు సినిమానే అని చెప్పుకొచ్చారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: