ప్రముఖ దర్శక ధీరులు కోడి రామకృష్ణ గారు ఇకలేరు….!

తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన దర్శకధీరులు కోడి రామకృష్ణ గారు ఈరోజు తుదిశ్వాస విడిచారు.1982 లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు,చిరంజీవి, మాధవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి గొల్లపూడి మారుతీరావు గారు రచయితగా వ్యవహరించారు.ఈ సినిమాతో పాటు తెలుగు పరిశ్రమలోని పలు అగ్ర కథానాయకులతో భారీ నుంచి అతి భారీ విజయవంతమైన చిత్రాలు చేశారు.బాలకృష్ణ గారితో పలు సినిమాలు చేసిన అందులో మంగమ్మ గారి మనవడు,ముద్దుల మావయ్య సూపర్ హిట్స్ అయ్యాయి.అలాగే వెంకటేష్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం,శత్రువు కానీ రాజశేఖర్ తో చేసిన అంకుశం కానీ అనుష్క తో చేసిన లేడి ఓరియెంటెడ్ చిత్రం అరుంధతి కానీ కోడి రామకృష్ణ గారి సినిమాల్లో మైలు రాయిగా నిలిచిపోయిన సినిమాలని చెప్పొచ్చు.

ఒక రకమైన కథలే కాకుండా ఆ సమయంలో పలు వైవిధ్యమైన కథలతో చిత్రాలు చేసిన ఘనత కోడి రామకృష్ణ గారికే దక్కింది.సామాజిక అంశాలపై తీసిన వాటిల్లో అంకుశం,20వ శతాబ్దం, భారత్ బంద్,శత్రువు అన్నీ కమర్షియల్ గా ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాలు సాధించాయి.స్పై థ్రిల్లర్ నేపథ్యంలో గూఢచారి నెం.1,గూఢచారి 117 చేయగా అందులో గూఢచారి నెం.1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇక వీటితో పాటు భక్తిరస మరియు సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన అమ్మోరూ,దేవి,దేవుళ్ళు, అరుంధతి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అదే నేపథ్యంలో వచ్చిన దేవీపుత్రుడు,అంజి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
100 కి పైగా సినిమాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ గారి కెరీర్‌లో సగం కి పైగా విజయవంతమైన సినిమాలే ఉన్నాయి.2012 లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కోడి రామకృష్ణ గారిది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.
ముప్పై సంవత్సరాలకి పైగా సినీ పరిశ్రమలో ఉన్న కోడి రామకృష్ణ గారు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసారు,అందులో 90 శాతం తెలుగు సినిమాలే అని చెప్పొచ్చు.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ని దేవి సినిమాతో పరిచయం చేశారు.తీవ్ర అనారోగ్య కారణంగా గచ్చిబౌలి లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ లో నిన్న (ఫిబ్రవరి 21న) చేర్చారు, వెంటిలేటర్ మీద చికిత్స అందించిన ఆయన ఆరోగ్యం కుదట పడలేదు ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియాగానే తెలుగు పరిశ్రమలోని పలువురు హీరోలు దర్శకనిర్మాతలు సంతాపం తెలియజేశారు. ఇక తెలుగు సినీ ప్రేమికులు ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలకి పైగా దర్శకత్వం వహించి వాటిల్లో నాలుగు సూపర్ హిట్స్ అందించిన వాళ్ళలో కోడి రామకృష్ణ గారు ఒకరు,ఇలా అకస్మాత్తుగా ఆయన మరణించడం ఆ తరం ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: